బువ్వపెట్టించండి సారూ..

ఏటూరునాగారం: గిరిజన యువతీ, యువకులను వృత్తి నైపుణ్యులుగా తీర్చిదిద్ది ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఐటీడీఏ ఆధ్వర్యాన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా 2019 సెప్టెంబర్‌లో జీఎన్‌ఎం, డీఓటీ, డీఎంఎల్‌టీ కోర్సుల కోసం దరఖాస్తుల ఆహ్వానించారు. దరఖాస్తుదారులనుంచి 58 మందిని ఐటీడీఏ అధికారులు అక్టోబర్‌ 5న ఎంపిక చేశారు. ఇందులో 40 మందిని హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రికి జీఎన్‌ఎం, డీఎంఎల్‌టీ కోర్సుల్లో శిక్షణ నిమిత్తం పంపించారు. మిగతా వారిని వరంగల్, కరీనంగర్‌ వైద్య కోర్సులకు పంపించారు. అయితే హైదరాబాద్‌లోని విద్యానగర్‌లోని గిరిజన హాస్టల్స్‌లో నాలుగు నెలలుగా 40 మంది విద్యార్థులు ఉంటున్నారు.



వీరికి  భోజనం, వసతితోపాటు ఉపకార వేతనాలు, హాస్టల్‌కు మెస్‌చార్జీలు కూడా అందించాల్సి ఉంది. నాలుగు నెలల నుంచి ఇవ్వకపోవడంతో అక్కడి నిర్వాహకులు విద్యార్థులను చిన్న చూపు చూడడం, అందులో ఉండే డిగ్రీ విద్యార్థులకు మాంసం భోజనాలు పెట్టి వీరికి పెట్టకపోవడంతో చిన్నబుచ్చుకున్న విద్యార్థులు చదువు కూడా ఒంటబట్టని పరిస్థితి నెలకొంది. అయితే వారికి విద్యార్థులకు కావాల్సిన భోజన బిల్లులను ఐటీడీఏ నుంచి రాకపోవడంతో అక్కడున్న నిర్వాహకులు భోజనం, పాలు, టిఫిన్‌ వడ్డించేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో విద్యార్థులు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. మెస్‌చార్జీలు ఇస్తేగాని సరైన భోజనం పెట్టని పరిస్థితి ఉందని విద్యార్థులు వాపోతున్నారు. అంతేకాకుండా ఉపకార వేతనాలు లేక హాస్టల్స్‌ నుంచి గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రోజు పోయి రావడానికి బస్సు చార్జీలు తడిసిమోపెడు అవుతున్నాయి. ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. దీంతో బస్‌పాస్‌లు కల్పించాలని అధికారులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఏమిచేయలేక ఇంటి దగ్గర నుంచి డబ్బులు అందక కాలేజీకి పోలేని పరిస్థితి నెలకొంది. ఇటు మెస్‌చార్జీలు చెల్లించక, ఉపకార వేతనాలు అందక విద్యార్థులు కంటి నిండ నిద్ర, కడుపు తిండిలేకుండానే రోజులు వెళ్లదీస్తున్నారు. వృత్తి కోర్సులను నేర్పించడానికి తీసుకెళ్లిన అధికారులు విద్యార్థులు అలాన పాలన చూసుకోకుండా చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు, పెరిగిన ఊరును వదిలేసి పట్టణంలో ఉంటున్న వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. 



Popular posts